పవన్ అన్నా... ఒక్కసారి నువ్వు ప్రశ్నించాలన్నా... మంగళగిరి రైతులు

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ల్యాండ్ పూలింగ్ పై రాజధాని పరిధిలోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి నిరసనలు వస్తున్నాయి. మంగళగిరి బేతపూడి చిన్నకారు రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న విధానానికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాకు పిలుపునిచ్చారు. వీరంతా జనసేన పార్టీకి చెందినవారు కావడం గమనార్హం. 
 
ఎన్నికల సమయంలో పవన్ అన్నయ్య తమను తెలుగుదేశం, భాజపా పార్టీలకు ఓట్లేయమని చెప్పారనీ, అందువల్ల తామంతా ఆ పార్టీలకే ఓట్లు వేసి అధికారం వచ్చేందుకు దోహదపడ్డామని అంటున్నారు. కానీ ఇప్పుడు తమకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు తమ భూములను అడ్డగోలుగా లాక్కునేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. 
 
తామంతా 20 సెంట్లు, 50 సెంట్లు, ఎకరం పొలాలతో ఉన్న చిన్న రైతులమనీ, పూల తోటలు వేసుకుని బతుకుతున్నామన్నారు. అలాంటిది ప్రభుత్వం తమకు రూ. 30 వేలు ఇస్తామని చెపుతోందనీ, వరి పండే భూమికి తాము పూల తోటలు పండించే భూమికి తేడా లేకుండా చూస్తోందని అన్నారు. తమకు న్యాయం జరిగేట్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూస్తారని తాము కొండంత ఆశతో ఉన్నామన్నారు. తమకు అండగా నిలబడతారని నమ్మకముందని వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి