దేశీ ఆవులలోని లాభాలను గుర్తించాలి : మంత్రి మాణిక్యరావు

ఆదివారం, 21 డిశెంబరు 2014 (21:09 IST)
దేశీయ జాతి ఆవుల పెంపకంలో ఉన్న లాభాలను గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి మాణిక్యరావు అన్నారు. ప్రతి ఒక ఇంట్లోనూ దేశీ ఆవుల పెంపకం ఉండాలని హితవు పలికారు. తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణ శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవులు కేవలం జంతువు మాత్రమే కాదని అది కుటుంబ సభ్యురాలుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

దేశవాళి ఆవు జాతుల నుంచి మంచి లాభాలను పొందడానికి శాస్త్రీయమైన పద్దతులను అనుసరించాలని సూచించారు. ఆవుల ఉత్పత్తుల నుంచి ఆరోగ్యకరమైన వ్యవసాయ దిగుబడులకు ఉపకరిస్తాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన వారికి దేశవాళి విత్తన ఆవులను ఇవ్వడానికి సిద్ధం కావాలని కోరారు. ఆవుల పెంపకంలో కొత్త యాజమాన్య పద్దతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతోందన్నారు. 
 
అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో పోలా భాస్కర్ మాట్లాడుతూ, అదృష్టం కొద్ది తమకు కేటాయించిన 430 ఎకరాల స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవుల పెంపకానికి సిద్ధమవుతోందన్నారు. రాబోవు రోజుల్లో కేవలం ఖర్చులను మాత్రం తీసుకుని దేశవాళి విత్తన కోడెదూడలను అడిగిన వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి