'వీడిది గట్టి పిండంరా' అని అపుడపుడూ అంటుంటారు మన పెద్దలు. ఇపుడు ఓ వ్యక్తిది నిజంగానే గట్టిపిండమైంది. నెత్తిన పిడుగు పడినా బతికిపోయాడు. సాధారణంగా పిడుగు పడితే మాడిమసైపోవాల్సిందే. కానీ, ఈ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి కారణం తలకు శిరస్త్రాణాం ధరించివుండటమే. ఈ ఘటన మెదక్ శివారు ప్రాంతాల్లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
వెల్దుర్తి మండల రామాయిపల్లికి చెందిన నర్సింహులు శివ్వాయిపల్లి నుంచి బైక్‌పై మెదక్ వస్తున్నాడు. ఈ సమయంలో దారిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షానికి బైక్ నడపలేక బంగ్లా చెరువు కట్టపై ఉన్న మర్రిచెట్టు కింద ఆగాడు. సహిగ్గా ఆ సమయంలోనే హఠాత్తుగా వర్షంతోపాటు పిడుగు పడింది. అది కూడా సరిగ్గా నర్శింహులు తలపైనే పడింది. ఆ పిడుగుపాటుకు నర్సింహులు గాయపడ్డాడే కానీ ప్రాణాలు కోల్పోలేదు. ఈ ఘటన ఈనెల 20వ తేదీన జరిగింది. దీనికి కారణం తలపై హెల్మెట్ ధరించివుండటమే. సో, పిడుగుపాటు నుంచి హెల్మెట్ రక్షిస్తుందన్నమాట.
సాధారణంగా ద్విచక్రవాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు పదేపదే చెబుతుంటారు. నిర్బంధ హెల్మెట్‌పై అనేక రకాలుగా అవగాహనా ప్రచారాలు సైతం చేస్తుంటారు. హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బైటపడ్డవారు ఎంతోమంది ఉన్నారు. ఇపుడు ఏకంగా పిడుగుపాటు నుంచి కూడా మనిషి ప్రాణాలను రక్షించింది.