సినిమా టికెట్ రేట్ల వివాదం జటిలం అవుతున్న తరుణంలో, సీఎం వైఎస్ జగన్ తనను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా ఆహ్వానించారని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సీఎంతో లంచ్ మీటింగ్ ను పూర్తి చేసుకుని, సీఎం నివాసం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
సినిమా అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ఆలోచన తనకు నచ్చిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అయితే, అదే కోణంలో ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ కి చెప్పానన్నారు. ఈ అంశాన్ని రెండువైపుల నుంచి తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారన్నారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమలో కార్మికులు దయనీయ పరిస్థితిలో గడిపారని, సినీ పరిశ్రమ సాధక బాధలను తాను కూడా తెలుసుకున్నానని సీఎం చెప్పారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం తనకు హామీ ఇచ్చారని చిరంజీవి చెప్పారు.
సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో పునరాలోచన చేస్తున్నామని సీఎం జగన్ తనకు చెప్పారని చిరంజీవి తెలిపారు. సినీ పెద్దగా కాదు, బిడ్డగా తాను ఇక్కడి కి వచ్చానని, సినిమా టిక్కట్లపై త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారని వివరించారు. ఒక రోజులో ఐదో షో ఉండాలా? లేదా? అన్న విషయంపై కూడా ఆలోచన చేస్తామన్నారని చెప్పారు. ఈ చర్చల దశలో సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి చెప్పారు.
పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. రెండు, మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని, త్వరలోనే కమిటీ సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాము వస్తామని చిరంజీవి తెలిపారు.