అమరావతి : తన పదవీ కాలంలో పూర్తయ్యేలోగా చిత్తూరు జిల్లాకు సాగు, తాగు నీరిందించడమే ధ్యేయమని ఎమ్మెల్సీ బీఎన్.రాజసింహులు(దొరబాబు) అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ హాల్ లోని బీఏసీ సమావేశ హాలులో దొరబాబుతో శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్సీ రాజసింహులు(దొరబాబు) విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే మొట్టమొదటిసారిగా ఏకగ్రకీవంగా ఎన్నికయ్యానన్నారు.
తన ఎన్నికకు కృషి చేసినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ బాబు...తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో అహర్నిశలూ కృషి చేస్తానన్నారు. 1982 నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో పాటుపడుతున్నారని, ఆయన సహకారంతో, చిత్తురు జిల్లాలో తాగు, సాగు నీటి కల్పనకు కృషి చేస్తానన్నారు.
జిల్లాలో 40 వరకూ మండలాలు, 7 మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. గాలేరు నగిరి, హంద్రీనీవా, తెలుగు గంగ ద్వారా జిల్లాలో కొన్ని ప్రాంతాలకు సాగు, తాగు నీరిందుతోందన్నారు. పదవీ కాలం పూర్తయ్యే లోగా జిల్లాలోని అన్ని ప్రాంతలకూ సాగు, తాగు నీరిందించడమే ధ్యేయంగా పెట్టుకున్నానన్నారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి దృష్టి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన రాజసింహులు(దొరబాబు)కు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.