రైతుకు మరింత భరోసా... రూ.12,500 నుంచి రూ.13,500కి పెంచిన సీఎం
మంగళవారం, 15 అక్టోబరు 2019 (06:00 IST)
రైతుకు మరింత భరోసానిస్తూ ముఖ్యమంత్రి వైయస్.జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా రూ.12,500 కాకుండా రూ.13,500 నిర్ణయించారు. నాలుగేళ్లలో రూ.50వేలు ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.
అయితే ఈ పథకాన్ని ఐదేళ్లపాటు పొడిగిస్తూ ఇస్తామన్న రూ.50వేలకు బదులు రూ.67,500 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సడలించాలంటూ అధికారులకు ఆదేశించారు. రైతు మరణిస్తే, ఆ కుటుంబానికి అర్హత ఉంటే, ఆ రైతు భార్యకు రైతు భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఉద్యోగుల తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటే వారికీ రైతు భరోసా ఇవ్వాలని, అలాగే ఆదాయపు పన్ను కడుతున్న వారి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటే వారికీ ఈపథకాన్ని వర్తింపు చేయాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన వారికి రైతుభరోసా ఇవ్వాలని, సంతప్తికర స్థాయిలో పథకాన్ని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశించారు. దీనికోసం నవంబరు 15 వరకూ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగిస్తున్నామని సీఎం వెల్లడించారు.
సచివాలయంలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్షించారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మార్కెటింగ్ ,మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రముఖ పాత్రికేయుడు, వ్యవసాయ నిపుణుడు పాలగుమ్మి సాయినాథ్, మిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మంగళవారం నాడు నెల్లూరు సమీపంలో వైయస్సార్ రైతు భరోసా ప్రారంభం అవుతున్న దష్ట్యా లబ్ధిదారుల ఎంపికపై సీఎం ఆరాతీశారు. ఇదేసమయంలో మిషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్న రైతు ప్రతినిధుల వ్యవసాయ రంగంలో తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి దష్టికి తీసుకు వచ్చారు.
ఈఏడాది వర్షాలు పడ్డా, సకాలంలో కురవలేదని, ఖరీఫ్‌సాగు కూడా సాధారణ స్థాయి దాటలేదని సీఎంకు వివరించారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టతరంగా ఉన్నప్పటికీ హామీలు అమలుకోసం, రైతుల ప్రయోజనాల కోసం అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, రైతు భరోసాకింద ఇచ్చే మొత్తాన్నికూడా పెంచాలని విజ్ఞప్తిచేశారు.
పంట ఇంటికి వచ్చే సమయంలో రైతులు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సమయంలో కొంత పెంచి ఇవ్వాలని కోరారు. దీనికి వీలుగా రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రెండు సీజన్లకు, మూడు విడతలుగా ఇచ్చినా అభ్యంతరంలేదంటూ ముఖ్యమంత్రికి వివరించారు. మే నెలలో, ఖరీఫ్ పంటకోసే సమయంలో మరియు రబీకి సిద్ధమవుతున్న సమయంలో, సంక్రాంతి సమయంలో ఇవ్వాలని అభ్యర్థించారు.
రైతు ప్రతినిధులు చేసిన సూచనపై సమావేశంలో చాలాసేపు చర్చజరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అనుకున్నదానికంటే ముందుగానే రైతు భరోసా ఇవ్వగలమా? లేదా? అని ఆలోచించామని సీఎం అన్నారు. ఏటా రూ.12,500 నాలుగేళ్లపాటు, మొత్తంగా రూ.50వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల ముందుగానే ఇస్తూ, ఈపథకాన్ని ఐదేళ్లకు వర్తింపు చేసేట్టుగా నిర్ణయం తీసుకున్నామని సీఎం గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చేనాటికి ఖరీఫ్ సమయం ముగిసినందున రబీకైనా అక్టోబరులో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చివరకు వారి ప్రతిపాదనలను సీఎం అంగీకరించారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పటికీ రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నందున ఎంతచేసినా తప్పులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని అందుకే వైయస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రైతు ప్రతినిధులు కోరినట్టుగా మరో వేయి రూపాయలు పెంచుతున్నట్టుగా సమావేశంలో ప్రకటించారు. అధికంగా పనులు కల్పించేది వ్యవసాయరంగమే అయినందున వీరి ప్రతిపాదనలకు అంగీకరిస్తున్నానని సీం అన్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఏడాదికి 12,500 నుంచి రూ.13,500కు పెంచుతున్నామని సీఎం వెల్లడించారు.
నాలుగేళ్లలో రూ.50వేల బదులు రూ.67,500 ఇవ్వబోతున్నామని, చెప్పిన దానికన్నా రూ. 17,500 అధికంగా ఇస్తున్నామని, రైతులకూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ పెంచిన నిర్ణయం కారణంగా అదనంగా రూ.17,500 సహాయం అందుతుందని సమావేశంలో తెలిపారు. రైతుల ప్రతినిధులు చెప్పినట్టు... మేలో, పంటకోతకు వచ్చే సమయంలో లేదా రబీ అవసరాకోసం కొంత, రైతు పండుగ సమయం సంక్రాంతిలో మరికొంత ఇద్దామన్నారు.
మే నెలలో రూ.7500, అక్టోబరులో పంటకోసే సమయంలో లేదా రబీ సన్నాహాలకోసం రూ.4,000, సంక్రాంతి సమయంలో రూ.2వేలు ఇద్దామన్న రైతు ప్రతినిధుల సూచనను పరిగణలోకి తీసుకుని ఆమేరకు పథకాన్ని అమలు చేద్దామన్నారు.
వైయస్సార్ రైతు భరోసాకు ఎంపికైన లబ్దిదారుల సంఖ్యపై సీఎం ఆరాతీశారు. గత ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి 43 లక్షలమంది రైతులతో జాబితాను పంపారని అధికారులు సీఎంకు వివరించారు. అంతకంటే మిన్నగా ఈ పథకం ద్వారా పారదర్శకంగా సుమారుగా 51 లక్షలమంది రైతులు ఎంపిక కానున్నారని సీఎం చెప్పారు.
ఈసారి మరో 3 లక్షల మంది భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ పథకం వర్తిస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. రైతు భరోసా ఈసారి అక్టోబరులో ప్రారంభం అయిన దష్యా వచ్చే మే నుంచి కౌలు రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అక్టోబరు 15 తర్వాత కూడా నెలరోజులపాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు.
సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లాంటి ప్రజా ప్రతినిధులు పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారంటూ సీఎంకు వ్యవసాయమిషన్ సభ్యులు వివరించారు. దీనిపై సీఎం వెంటననే స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు తప్ప మిగతా ప్రజాప్రతినిధులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.
ఆక్వాకల్చర్ కిందకు మార్చిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపుపన్ను కట్టేవారిని రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించామని అధికారులు వివరించారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉంచాలని, ఎవరెవరికి పథకం వర్తించదో.. ఆ వివరాలనూ డిస్‌ప్లే చేయాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికోసం వచ్చే విజ్ఞాపన పత్రాలను వెంటనే పరిష్కరించేలా సరైన యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రైతుభరోసాను సంతప్తికర స్థాయిలో అమలు చేయాలని, గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో వాడుకోవాలన్నారు.
రైతు మరణిస్తే.. అతని భార్యకు రైతుభరోసా ఇవ్వాలని, పిల్లలు ఉద్యోగులైనా వ్యవసాయం చేస్తున్నట్టైతే వారికీ పథకాన్ని వర్తింపుచేయాలంటూ మార్గదర్శకాలను సడలించాలని సీఎం చెప్పారు. ఆదాయపు పన్ను కడుతున్న వారికి తప్ప, వ్యవసాయం చేస్తున్న వారి తల్లిదండ్రులనీ లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే నగదు జమకావాలని ఆదేశించారు.
పథకానికి ‘‘ వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’’గా పేరుపెట్టాలని చెప్పారు. కేంద్ర నుంచి వచ్చే నిధులు, తెచ్చుకునే రుణాలు, గ్రాంట్లు ఇవన్నీ కలిపితేనే బడ్జెట్ అని, ఈ విషయంలో ఇతరత్రా ఆలోచనలు వద్దని సీఎం అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుద్దామని వ్యాఖ్యానించారు. దీనిమీద కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రచ్చ చేసే స్థాయికి వెళ్లడం దురదష్టకరమన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకున్న మిల్లెట్స్ బోర్డుపై సీఎం ఆరాతీశారు. వచ్చే ఖరీఫ్ నాటికి మిల్లెట్స్‌పై ప్రమోషన్ స్కీంను తీసుకురావాలని ఆదేశించారు. అందుకు తగినట్టుగా విత్తనాలను కూడా సిద్ధంచేసుకోవాలన్నారు. మిల్లెట్స్, వరి బోర్డుల ఏర్పాటుకు వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టాలని, అక్టోబరు 16నాటి కేబినెట్‌సమావేశంలో అజెండాగా ఈ అంశం పెట్టాలన్నారు. నెలాఖరు నాటికి ఛైర్మన్ల నియామకాన్ని పూర్తిచేయాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్న విషయాన్ని మిషన్‌సభ్యులు సీఎంకు నివేదించారు. ప్రమాణాలు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలేజీల్లో నాణ్యత లేకపోతే... వ్యవసాయరంగమే దెబ్బతింటుందన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు, వ్యవసాయ యూనిర్శిటీలకు మధ్య సమన్వయం లేదని సీఎం దష్టికి తీసుకువచ్చారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.
కో–ఆపరేటివ్ రంగంలో చక్కెర కర్మాగారాల పరిస్థితి బాగోలేదని,
గడచిన ఐదేళ్లలో వాటిని పట్టించుకోలేదని, వచ్చే రెండేళ్లలో వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. సుగర్ ఫ్యాక్టరీలను పూర్తిస్థాయి ఆపరేషన్స్‌లోకి తీసుకురావడమే కాకుండా, మంచి మార్కెటింగ్ అవకాశాలను కల్పించేలా తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్నారు.
ధరల స్థిరీకరణకు బడ్జెట్లో పెట్టిన రూ.3వేల కోట్లను వినియోగించాలని, బడ్జెట్లో పెట్టడం కాదు, దాన్ని ఫలితాలు రైతులకు అందాలని సీఎం చెప్పారు.
పామాయిల్ ఏపీలో రికవరీ 17.2 శాతం ఉంటే, తెలంగాణలో 18.94 శాతం ఉందని సీఎం దష్టికి రైతు ప్రతినిధులు తీసుకు వచ్చారు. పెదవేగి ప్లాంటులో కొందరు ఉద్యోగుల అక్రమాలను వీరు ప్రస్తావించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈనెలాఖరులోగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకానికి సీఎం ఆదేశాలు జారీచేశారు.
టమెటా ధరలపైనా సమావేశంలో చర్చ జరిగింది. రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం చెప్పారు. బెంగుళూరు, చెన్నై మార్కెట్లలో రేట్లను పరిగణలోకి తీసుకుని ఆమేరకు ప్రభుత్వం జోక్యంచేసుకుని ధరలు స్థిరీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
టమోటా ప్రాససింగ్‌యూనిట్లపై దష్టిపెట్టాలన్నారు. టమోటా సమస్యకుశాశ్వత పరిష్కారంకోసం ఆలోచన చేయాలన్నారు. పసుపు విషయంలో కూడా ఇలాంటి ఆలోచనే చేయాలని సీఎం అన్నారు.