టి రాజయ్యను బర్తరఫ్ ఎందుకు చేశారంటే.. మోత్కుపల్లి వివరణ!

మంగళవారం, 27 జనవరి 2015 (14:39 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తాటికొండ రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారనే అంశంపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వివరణ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియకుండా ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై రాజయ్య తొందరపాటుతో ప్రకటన చేశారని దీంతో ఆయనను మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో బర్తరఫ్ చేశారన్నారు.
 
సీఎం కేసీఆర్ వైఖరిపై మోత్కుపల్లి స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నానా కష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి 50 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. 
 
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంది దళితులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. మాదిగ కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచారంటూ కితాబు ఇస్తూ, ఆయన బర్తరఫ్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో చెప్పాలని కేసీఆర్‌కు మోత్కుపల్లి సవాల్ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి