అతడో ఎంటెక్ విద్యార్థి. పేరు ప్రశాంత్ కుమార్. హైదరాబాద్ వాసి. మందు, మగువకు బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. పబ్‌లో గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడమంటే అతడికి మహాసరదా. ఓ రోజు పీకల దాకా తాగి గర్ల్‌ఫ్రెండ్‌ను దించడానికి గచ్చిబౌలి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి దేవదానం(72)ను కారుతో ఢీకొట్టి అతడి మరణానికి కారణమయ్యాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
ఈ వివరాలను పరిశీలిస్తే... గత నెల 10వ తేదీ తెల్లవారుజామున రాయదుర్గం, మాతా టెంపుల్ వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దేవదానం అనే వృద్ధుడు మరణించాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సికింద్రాబాద్, బాపూఘాట్‌కు చెందిన నిందితుడు గుత్తికొండ ప్రశాంత్ కుమార్‌గా గుర్తించి సోమవారం అరెస్టు చేశారు.
కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ప్రశాంతకుమార్ ఎంటెక్ చదువుతూ... తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి నిత్యం పబ్‌లలో గడుపేవాడు. అలాగే, డిసెంబర్ 9, 2016 రాత్రి స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి.. ఫోర్డ్ కారు(ఎపి10బిసి6768)లో గర్ల్‌ఫ్రెండ్స్ గౌరీ, ప్రాచీలతో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కెళ్లి.. తెగ ఎంజాయ్ చేశాడు.
అర్థరాత్రి 2 గంటలకు గచ్చిబౌలిలో ఐఎస్‌బీ రోడ్డులోని హిల్‌వ్యూ అపార్టుమెంట్‌లో నివసించే ప్రాచీని డ్రాప్ చేసి... తిరుగు ప్రయాణంలో ఇంటికి త్వరగా చేరుకోవాలన్న ఆతృతతో కారును అమితవేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్ వేగంగా వెళ్తూ రాయదుర్గం, మాతా టెంపుల్ వద్ద దేవదానంను ఢీకొట్టాడు. కారును ఆపకుండా వెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించిన రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి చర్లపల్లి జైలుకుతరలించారు.