చంద్రబాబూ.. నిన్ను అనరాని మాటలన్నా.. క్షమించండి: ముద్రగడ పద్మనాభం

సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (15:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కడుపుమండి అనరాని మాటలు అన్నాననీ, అందుకు మనస్సు నొప్పించివుంటే క్షమాపణలు కోరుతున్నట్టు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులను బీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. సోమవారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ముద్రగడ తన దీక్షను విరమించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు జాతి సంక్షేమం కోసం జీవితాంతం కట్టుబడేందుకు నిర్ణయించుకున్న తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఏవైనా అనరాని మాటలు అనుంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాపుల రిజర్వేషన్ కోసం మరోసారి రోడ్డెక్కేలా చేయరాదని, అనుకున్న గడువులోగా కమిషన్ నివేదిక వచ్చి, ఆపై రిజర్వేషన్ల అమలు జరగాలన్నదే తన అభిమతమన్నారు. 
 
తనకు వయసు పెరుగుతోందని, ఎంతకాలం ఓపికగా ఉండగలుగుతానో తెలియదన్నారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా చంద్రబాబు కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ప్రసంగాల్లో భాగంగా విమర్శించినా, తిట్టినా వాటిని మనసులో పెట్టుకోవద్దని, ఇచ్చిన మాట తప్పవద్దని చంద్రబాబును కోరారు. 
 
కాపుల కోసమే దీక్ష చేశానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అవడంతో ముద్రగడ దీక్షను విరమించినట్టు చెప్పారు. పైగా తన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. తమ జాతి ఆకలి కేకలను పట్టించుకోవాలనే దీక్ష చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని  ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని వివరించారు. పేదలకే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తనకు మద్దతుగా దీక్షలు చేపట్టినవారంతా విరమించాలని ముద్రగడ కోరారు. 

వెబ్దునియా పై చదవండి