తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసి వైకాపా పాలకులు వణికిపోతున్నారనీ, అందుకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ముగ్గురు భార్యలున్న పవన్ కల్యాణ్ తన నలుగురో.. ఐదుగురో పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని కోరారు. పవన్‌పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని... భవన నిర్మాణ కార్మికులపై మన అధినేత చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేసినట్టు భావిస్తున్నామన్నారు.