ఇసుక వాటాల కోసం కొట్టుకుంటున్న వైకాపా నేతలు : నారా లోకేశ్

మంగళవారం, 5 నవంబరు 2019 (16:02 IST)
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధ్వాన్నపు పరిపాలన సాగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను కృత్రిమంగా సృష్టించి, ఆ ఇసుక వాటాల కోసం వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక కొరతతో పనుల్లేక కార్మికుల కుటుంబాలు ఇలా చితికిపోవడం మనసును కలచివేస్తోందన్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం ఇదే తొలిసారన్నారు. 
 
జగన్ ప్రభుత్వ చేతగానితనంతోనే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందన్నారు. ఇసుక వాటాల కోసం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని, ఇసుక వివాదాలు తీర్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రాణాలు పోతున్నా జగన్ ఇసుక సమస్యను తాత్కాలికమేనంటూ తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. 
 
మీ ఇంట్లో ఎవరైనా  ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే స్పందిస్తారా? అంటూ నిలదీశారు. మరోవైపు, శవరాజకీయాలంటూ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి టీడీపీ తరపున లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు