హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు నాకా.. నో.. నో..!: గవర్నర్

మంగళవారం, 31 మార్చి 2015 (10:33 IST)
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు కట్టబెడతారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కేవలం మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయే తప్ప కేంద్రంనుంచి తనకు అలాంటి సమాచారమేది లేదని ఆయన చెప్పారు. హోంమంత్రితో తన సమావేశం మామూలుగా జరిగేదేనని, అందులో ఈ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
 
హైదరాబాద్‌సహా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని ఎలాంటి ఇబ్బందులు లేవని గవర్నర్ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఆ వెంటనే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను, పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను ఆయనతో ప్రస్తావించారు. 
 
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనూ హైదరాబాద్ నగరంలోనూ శాంతిభద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులూ లేవని గవర్నర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో అధికారాలను గవర్నర్‌కే కట్టబెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. హైకోర్టు విభజన గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం వెలుగులోనే ఈ అంశం పరిష్కారమవుతుందని నరసింహన్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి