తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెరాస సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహా రెడ్డి విమర్శలు గుప్పించారు. తనకు పదవి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. పైగా, రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేశారనీ, ఆ పదవిని వద్దని చెప్పినట్టు తెలిపారు.
ఆయన సోమవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... 'ముఠా గోపాల్‌ను గెలిపించుకునిరా... నిన్ను మంత్రిని చేస్తా'నని కేసీఆర్ మాట ఇచ్చారని... ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు.
హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. తెరాస పార్టీకి కేసీఆర్ ఓనర్ అయితే, తాను కూడా ఓనర్‌నేనని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు. అలాగే, తన అల్లుడుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని, ఇపుడు అవన్నీ ఆయన మరచిపోయారని చెప్పారు.