మన చట్టాల్లో లోపాలున్నాయ్... ఉగ్రవాదులకు ఉరి తగదు : శశిథరూర్

సోమవారం, 3 ఆగస్టు 2015 (10:37 IST)
మన చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయనీ, అందువల్ల ఉగ్రవాదులకైనా మరణశిక్షలను అమలు చేయరాదని కేంద్ర మంత్రి శశిథరూర్ అభిప్రాయపడ్డారు. తిరువనంతపురం ఎంపీగా ఉన్న ఆయన అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థరూర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకైనా సరే మరణశిక్ష విధించరాదన్న తన అభిప్రాయంలో మార్పు లేదని, రాజ్యం హంతకుల్లా వ్యవహరించకూడదన్నారు. 
 
దీనికి కారణం లేకపోలేదన్నారు. మన నేర చట్టాల వ్యవస్థలో అనేక లోపాలు, పక్షపాతం ఉన్నాయని అన్నారు. ఉగ్రవాదులను జీవితాంతం, కనీసం పెరోల్ కూడా ఇవ్వకుండా జైలులో ఉంచాలన్నదే తమ అభిమతమన్నారు. ఆదిమకాలంలో ఎవరైనా హత్యకు పాల్పడితే వారిని చంపివేయాలనే నమ్మకం ఉండేది. వ్యవహారభ్రష్టమైన ఇటువంటి విధానాన్ని మనమెందుకు అనుసరించాలి...? అని థరూర్ ప్రశ్నించారు. 
 
ఉరిశిక్షను అమలు చేసినప్పుడు మనం కూడా నేరగాళ్లలాగే వ్యవహరిస్తున్నామన్నారు. వారు హంతకులే.. కానీ ప్రభుత్వం వారిలాగా వ్యవహరించకూడదు అని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ కూడా ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదని అన్నారని తెలిపారు. ప్రపంచంలోని 143 దేశాలు ఇప్పటికే మరణశిక్షలపై నిషేధం విధించాయని, మరో 25 దేశాల్లో మరణశిక్ష విధించే చట్టాలున్నప్పటికీ అవి అమలు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం 35 దేశాలు మాత్రమే అమలు చేస్తున్నాయని శశిథరూర్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి