ఇక నాటకాలు వేరే ఉంటే ఆడుకోండి.. నియోజక వర్గాల పెంపు జరగదన్న కేంద్రం

గురువారం, 27 జులై 2017 (05:01 IST)
అనుకున్నదే అయింది. నియోజకవర్గాల పెంపు అంటూ అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్థాయిలో ఆడిన నాటకాలకు ఇక కాలం చెల్లిందని తేలిపోయింది. కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపని ఈ అంశంమీద గత రెండేళ్లుగా తెరాస, టీడీపీ ప్రభుత్వాలు ఆడిన దొంగాటలను మోదీ తిప్పికొట్టేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుంది కాబట్టి అందరికీ సీట్లు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల ఎంఎల్ఏలను ఫిరాయింపజేసిన రాజకీయాలకు పెద్ద షాక్ ఇచ్చారు మోదీ. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అనేది ఇక ముగిసిన అధ్యాయమే అని సంకేతాలు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రధాని టేబుల్ వద్ద ఉందని, అరుణ్ జైట్లీ టేబుల్‌పై ఉందని ఊరిస్తూ ఇన్నాళ్లూ అబద్దాలతో బతికేసిన కేంద్రమంత్రులకు మాడు పగిలినట్లయింది.
 
విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇక ఇది ముగిసిన అధ్యాయమేనన్న సంకేతాలు కేంద్రం నుంచి వెలువడ్డాయి. బుధవారం సాయంత్రం పార్లమెంటు హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరోక్షంగా ఈ విషయం స్పష్టం చేశారు. ప్రధాని వద్ద కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మోదీ మాత్రం దీనిపై స్పందించకుండా జవాబు దాటవేశారని తెలిసింది. ప్రధానితో సమావేశానంతరం బయటకు వచ్చిన కేసీఆర్‌ను ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇది మాకు అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. మేం ప్రస్తావించిన అంశాల జాబితాలో ఇది ఆరవది..’’ అంటూ అజెండా పత్రాలను చూపించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీట్లు పెంచితే ఏపీ లాగే తాము కూడా లాభపడతామని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్‌ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో మార్పులు చేయాల్సిందిగా గత మూడేళ్లుగా ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని కోరుతున్నాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు.. అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ నియోజకవర్గాల పునర్విభజనకు 2026 వరకు అవకాశం లేదని ఎన్నికల సంఘం సూచించింది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఇది ముగిసిన అధ్యాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
వాస్తవానికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో తెలంగాణ, ఏపీలో అధికార పార్టీలు ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహించాయి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్య ఉండదని భావించాయి. కానీ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజ్యాంగ సవరణతో కూడుకున్న అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ దీనిపై అంత ఆసక్తి చూపడం లేదు. అయినా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇన్నాళ్లూ తమ ప్రయత్నాలు కొనసాగించాయి. కానీ తాజా పరిణామాలతో ఇక నియోజకవర్గాల పెంపు ఉండకపోవచ్చన్న సంగతి స్పష్టమవుతోంది.
 
కేంద్రంలో ప్రత్యక్ష రాజకీయాలనుంచి వెంకయ్యనాయుడిని తప్పించి ఉపరాష్ట్రపతి బరిలోకి తోసేసిన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో మోదీ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల సీఎంలకు నిజంగానే కేంద్రంలో పెద్దదిక్కు పోయిందా.. వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. 
 
ఒకటి మాత్రం నిజం. నియోజకవర్గాల పెంపు బిల్లు ఈ టేబుల్ మీద ఉంది. ఆ టేబుల్ మీద ఉంది అంటూ కేంద్ర మంత్రుల స్థాయి తెలుగు నేతలు ఇక ఊరించలేరు. నాటకాలు ఆడలేరు.
 

వెబ్దునియా పై చదవండి