వైఎస్ భూములు అమ్మేశారు... బాబు ఏం చేస్తాడోనని భయం... పవన్ కళ్యాణ్

గురువారం, 5 మార్చి 2015 (12:57 IST)
జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. ఉండవల్లి రైతులతో ముఖాముఖి పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు సంతోషంగా భూములు ఇవ్వాలి కానీ వారు ఆవేదనతోనో, ఆందోళనతోనో, భయంతోనో భూములు ఇవ్వకూడదన్నారు. తాను రైతులతో మాట్లాడిన అనంతరం ఓ విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. 
 
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూములను అమ్మేయడం జరిగిందనీ, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందన్న భయంలో రైతులు ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించిన పవన్ తన అంచనా ప్రకారం 8 వేల ఎకరాలు చాలని చెప్పుకొచ్చారు. 
 
అసలు రుణమాఫీకే ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు ఇక రాజధాని నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రైతులు భూములను సంతోషంగా ఇస్తే తనకేమీ అభ్యంతరం లేదనీ, కానీ వారి నుంచి బలవంతంగా లాక్కుంటే మాత్రం తాను ఆమరణ దీక్షకు సిద్ధమని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి