విజయవాడ: విజయవాడలో అకస్మాత్తుగా మృతి చెందిన ఒక యువకుడి అవయవ దానం ఆఘమేఘాలపై జరిగిపోయింది. ఆ యువకుడికి అవయవాలన్నింటినీ దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో గన్నవరం నుంచి విమానంలో హైదరాబాదుకు గుండె, కాలేయం తీసుకెళ్లారు. విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో ఈ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది.
అచేతనంగా కొద్ది రోజులు చికిత్స పొంది మృతి చెందిన ఆ యువకుడి అవయవాల దానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కేవలం తలనొప్పి, జ్వరంతో అపస్మారక స్థితిలోకి ఆ యువకుడు వంశీకృష్ణ చివరికి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆంధ్ర ఆస్పత్రిలో జీవన్ దాన్‌కు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 9 నుంచి 10 మధ్య గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు గుండె, కాలేయం తరలించారు. మూత్రపిండాలు, కళ్లు విజయవాడ ఆస్పత్రుల్లోని బాధితులకు వినియోగించారు. జగ్గయ్యపేట మండవ ఇంజినీరింగ్ కళాశాలలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వంశీకృష్ణ పనిచేసేవాడు. ఆయన అవయవ దానం వల్ల జీవన్ దాన్ చేసినట్లయిందని వైద్య నిపుణులు చెప్పారు.