సమస్యలు తెలుసుకోవాలంటే తాను కూడా ప్రజా క్షేత్రంలో తిరుగుతూ కొంత నలగాల్సి ఉందని సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన గత మూడు రోజులుగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరిద్దరూ అభిమానులు ఆయన కారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పవన్ కలత చెందుతూ ఫ్యాన్స్‌కు సుతిమెత్తని హెచ్చరిక చేశారు.
తనకు స్వాగతం పలకాలన్న అభిమానుల అత్యుత్సాహం, వారి స్పీడ్‌ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందన్నారు. తాను సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా జరుపుకోనని, అభిమానులు నలిగిపోవడం తనకు ఇష్టం లేకనే ఫంక్షన్స్‌కు దూరంగా ఉంటానని చెప్పారు. కానీ, ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పదని, దీనివల్ల అభిమానులు ఇబ్బందులకు గురికావడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు.
కోట్ల మంది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చుంటే తెలుసుకోలేనని చెప్పిన పవన్ కల్యాణ్, తాను కూడా కొంత నలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి తరువాతే అభిమాన హీరో అనుకోవాలని హితవు పలికారు.
అంతకుముందు ఆయన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్ననియోజకవర్గం హిందూపురంలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుత పర్యటన ఎంతో కీలకమని జనసేన నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తిలో ఉన్న పవన్, సోమవారం సత్యసాయి సమాధిని, అత్యాధునిక ఆసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టపత్రి ఆసుపత్రి అనేక ప్రభుత్వాలకు ఆదర్శమన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడే సత్యసాయి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ప్రస్తుతం స్వయంగా చూశానని, ఇక్కడికి రావడం తన అదృష్టమన్నారు. వివేదానంద, రామకృష్ణ పరమహంసలా తెలుగువారికి సత్యసాయి ఆరాధ్యనీయుడని అన్నారు.