నెల్లూరు విద్యార్థుల పాదాలు చూసి చలించిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఏం జరిగింది?

శుక్రవారం, 3 మార్చి 2017 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వెనువెంటనే పరిష్కారం కావాలంటే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వద్ద చెప్పుకుంటే తీరిపోతుందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతోంది. దీనికి బలాన్ని చేకూర్చుతూ పవన్ కళ్యాణ్ కూడా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సభలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. సమస్య మొత్తం తీరకపోయినా అందులో కొద్దోగొప్పో పరిష్కారమవుతుంది. ఈ క్రమంలో ఇటీవలే చేనేత కార్మికలు సత్యాగ్రహం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి విద్యార్థులు తన సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా నుంచి కాలి నడకన హైదరాబాదులో కాటమరాయుడు షూటింగ్ చేస్తున్న పవన్ వద్దకు వెళ్లారు. శుక్రవారం నాడు వారంతా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. విక్రమ సింహపురి వర్శిటీ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు. 
 
తామంతా నెల్లూరు నుంచి కాలి నడకన వచ్చామనీ, మార్గమధ్యంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవగా విజయవాడలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. విద్యార్థులు పాదయాత్ర చేసి ఇక్కడికి వచ్చారని తెలియగానే వారి పాదాల వంక చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారని సమాచారం. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ఒత్తిడి తెస్తానని వారికి పవన్ హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి