ఒక రాజధానికే దిక్కు లేదు: పవన్ సెటైర్లు

బుధవారం, 18 డిశెంబరు 2019 (05:43 IST)
మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఒక రాజధానికే దిక్కులేదని, మూడు అమరావతులు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

‘‘"తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే... కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగ... ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక,మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకులు వలన, రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదు. 

కమిటీ రిపోర్ట్ రాక మునుపే, జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించేకాడికి, అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి? ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా?.

కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్లలా?

అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా? " అని ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.
 
జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) స్పందించారు. జగన్ వ్యాఖ్యలను స్వాగతించాల్సిందేనన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని  అన్నారు. కేంద్ర బిందువుగా మాత్రం అమరావతి ఉంటే బాగుంటుందని జయప్రకాశ్ నారాయణ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు