ఏపీలో వైకాపా అలజడిపై 'హోం'కు ఫిర్యాదు చేస్తా : పవన్ కళ్యాణ్

ఆదివారం, 15 మార్చి 2020 (12:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు సృష్టించిన అల్లర్లు, అలజడి, హింసాంత్మక సంఘటనలు, భౌతిక దాడులు, బెదిరింపులపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం హోం మంత్రికి ఫిర్యాదు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే, 'స్థానిక ఎన్నికలను ఎలాగో వాయిదా వేశారు కాబట్టి.. నామినేషన్ల ప్రక్రియ కూడా మళ్లీ జరపాలి' అని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆదివారం స్పందించారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందన్నారు. భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.
 
"రాష్ట్రంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తా. వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అమిత్ షాకు  అందజేస్తాం. జనసేన మహిళా నేతలపై దాడుల చేస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు జరిగాయి. 13 జిల్లాలో వైసీపీ దౌర్జన్యానికి పాల్పడింది. ఎన్నికల అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా స్వయంగా నేను వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తా'' అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా, 'ఏయే అధికారి ఏయే తప్పులు చేశారన్న విషయాలను కూడా బయట పెడతాం. వైసీపీ అధికారంలో ఉందని, సులువుగా తప్పించుకోవచ్చని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టరు' అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు