కృష్ణా నదీముఖ గ్రామాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దు : పవన్ కళ్యాణ్ ట్వీట్స్

బుధవారం, 19 ఆగస్టు 2015 (14:23 IST)
కృష్ణా నదీముఖ గ్రామాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములను సేకరించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్లు పోస్టు చేశారు. 
 
సారవంతమైన, పలు రకాల పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, ఇతర నదీముఖ గ్రామాల్లో పంట భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ తెలిపారు. తక్కువ నష్టంతో అభివృద్ధి జరిగేలా పాలకులు వివేచనతో ఆలోచించాలని సూచించారు. 
 
దేశం ఏదైనా, పాలకులు ఎవరైనా ఒక ప్రాంత అభివృద్ధికి మాత్రమే పాటుపడవద్దన్నారు. అలా జరిగితే వాతావరణ కాలుష్యం, స్థానిక స్థానభ్రంశంతో పాటు ఇతర సమూహాల ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. అందుకే రాజధాని ప్రాంతంలో ఇష్టంలేని రైతుల భూములపై భూమి సేకరణ చట్టం ఉపయోగించవద్దని టీడీపీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి