వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్

సోమవారం, 1 నవంబరు 2021 (13:33 IST)
విశాఖ ఉక్కు ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారం రోజులు టైమ్ ఇస్తున్నా.. ఏదో ఒకటి తేల్చండి అంటూ డెడ్ లైన్ పెట్టారు. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి. లేదంటే మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాను అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం చేస్తున్న వారికి సంఘీభావంగా.. కూర్మన్నపాలెంలో నిర్వహించిన సంఘీభావ సభలో జనసేనాని పవన్.. నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్నిటార్గెట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జనానికి చెప్పారు. 
 
ప్రైవేటీకరణ ప్రక్రియ అన్నది.. మోదీ ప్రభుత్వంతోనే మొదలు కాలేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతుంటే.. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాఫీలు తాగడానికి.. కబుర్లు చెప్పడానికి పార్లమెంట్ కు వెళ్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు.. ప్రజా సమస్యలపై.. తననే పోరాడాలని అన్ని పార్టీల వాళ్లూ అంటుంటారని పవన్ చెప్పారు. చివరికి తన పార్టీ మహిళలపై దాడులు జరిగినప్పుడు.. ఒంటరిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పారిపోయే వ్యక్తిని కానని.. ప్రజల కోసం నిలబడతానని. కలబడతానని అన్నారు. ముందడుగే తనకు తెలుసని.. పారిపోవడం తెలియని వ్యక్తిని తాను అని పవన్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది త్యాగాలతో ఏర్పడిందన్న పవన్.. ఈ వాస్తవాలను ఇప్పటి తరం తెలుసుకోవాలని యువతను కోరారు.
 
కేంద్రం తీసుకొచ్చిన ఎన్నో బిల్లులకు.. వైసీపీ ఎంపీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చారని పవన్ చెప్పారు. అలాంటి ఎంపీలు.. స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని.. ప్రశ్నించారు. వైసీపీ పాలకులకు తెలిసిందల్లా.. కాంట్రాక్టులు, డబ్బులు మాత్రమే అని.. ప్రజల కష్టాలు ఏ మాత్రం తెలియవని ఆరోపించారు. రైతుల ప్రాణాలు పోయినా.. నిర్వాసితుల ప్రాణాలు పోయినా.. వారికి పట్టింపు లేదని కామెంట్ చేశారు.
 
పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు.. అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా.. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ప్రభుత్వాన్ని తిడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతమంది జనం పవన్ ను చూడడానికి వస్తే.. జనం కోసం పనికి వచ్చిన జనం కోసం పనికి వచ్చే మాట ఒక్కటైనా మాట్లాడారా.. అని ప్రశ్నించారు. పోరాటం చేయడానికి భయమని పవనే ఒప్పుకున్నారన్నారు. అందరు పోరాడితే ఆయన వెనుక ఉంటాను అంటున్నారు.. అంతెందుకు అభిమానులను కూడా పవన్ తిట్టడం దారుణమన్నారు. పవర్ లేని స్టార్ అని అందరికీ తెలుసు అన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు