విశాఖపట్టణం నగరం దేశానికి తూర్పు తీర ప్రవేశద్వారంగా ఉంది. ఈ తీరానికి ప్రగతిహారాల్లో భాసిల్లే భారీ ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. వీటికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన మరోమారు ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రాల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పాల్గొంటున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి బాట పట్టించేలా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వైకాపా హయాంలో విధ్వంసానికి గురైన పారిశ్రామిక రంగానికి ఊపిరులూదేలా, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని మోడీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు.
ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొనే ఈ సభకు కూటమి పార్టీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఏపీలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే,
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1,200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తారు. రూ.1.85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇక్కడి నుంచి నిత్యం 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. తదనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.