పత్తికొండలో పోలీసు రాజ్యం.. బందోబస్తు మధ్య టమోటా వేలం

శనివారం, 12 అక్టోబరు 2019 (14:12 IST)
టమోటాకు మార్కెట్​లో డిమాండ్ ఉన్నప్పటికీ దళారుల కక్కుర్తి కారణంగా రైతులకు గిట్టుబాట ధర లభించటం లేదు. ఆరుగాలం పండించిన పంటకు రవాణా ఛార్జీలైనా రాక... పంట ఉత్పత్తులను అన్నదాతలు మట్టిపాలు చేశారు. రైతన్న ఆగ్రహంతో అధికారులు దిగొచ్చారు. కొనుగోళ్లు ప్రారంభించారు.

కర్నూలు జిల్లాలో ఏటా 24 వేల హెక్టార్లలో ఖరీఫ్​లో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర, తుగ్గలి, పత్తికొండ ,ఆలూరు నియోజకవర్గంలోని దేవరకొండ, ఆస్పరి, తదితర ప్రాంతాల్లో టమోటా సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంఖ్య అధికమే. పంట పండించినా గిట్టుబాటు ధర లేక కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు.

50 నుంచి 52 కిలోల బరువుండే 2 గంపల టమోటా వంద రూపాయల్లోపే ధర పలుకుతోంది. ఫలితంగా దారి ఖర్చులైనా రావడం లేదు. పత్తికొండలోని మార్కెట్ కమిటీలో జరగాల్సిన టమోటా విక్రయాలను వ్యాపారులు దళారుల కమిషన్ కక్కుర్తి కారణంగా గిట్టుబాటు ధర లేదంటూ రెండు రోజులుగా రైతులు నిరసనకు దిగారు.

రైతుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు రైతులు మార్కెట్‌లో ఆందోళనతో నిలిచిపోయిన వేలాం శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. రాత్రంతా వర్షంలో మార్కెట్‌లోనే పడిగాపులు కాసిన రైతులు ఉదయం వేలాం ప్రారంభంతో ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు.

గురువారం మార్కెట్‌కు వచ్చిన సరకునంతా శుక్రవారం కొనుగోలు చేయగా శుక్రవారం వచ్చిన సరకు ఇవాళ వేలాం వేస్తారు. 25 కిలోల జత గంపలు రూ.350 నుంచి రూ.450 వరకు అమ్ముడయ్యాయి. మరి కొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో ధరలు ఉంటే పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు