పోలీసులు బెదిరిస్తున్నారు: మాచర్ల పోలీసులపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదుల ఫిర్యాదు

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:56 IST)
మొదటి దశ పంచాయతీ ఎన్నికల విషయంలో.. గుంటూరు జిల్లా మాచర్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎస్​ఈసీకి హైకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులను పోటీచేయకుండా బెదిరిస్తూ.. ఇంటిపన్ను రశీదులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
 
గుంటూరు జిల్లా మాచర్లలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్న కొందరు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను రశీదును అభ్యర్థులకు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
 
ఈ మేరకు పారా కిషోర్, ఇంద్రనీల్ బాబు నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎస్​ఈసీని కలిశారు. మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, దుర్గి ఎస్సై వ్యవహారశైలిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
 
తొలి దశ ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించకుండా ఎస్ఈసీ నిలుపుదల చేయగా.. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తుగా పర్యటన చేస్తామని నిమ్మగడ్డను అనుమతి కోరారు. మాచర్లలో రెండవ దశ ఎన్నికల తీరుపై అధ్యయనం చేసి నివేదిక అందించి సహకరిస్తామని విన్నవించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు