శ్రీవారిని దర్శించుకున్న ప్రణబ్ ముఖర్జీ... రాష్ట్రపతి వాహనశ్రేణిలో ప్రమాదం!

బుధవారం, 1 జులై 2015 (15:09 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనంతోపాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్రపతి హైదరాబాద్ నుంచి తిరుపతికి బుధవారం ఉదయం చేరుకున్న విషయం తెల్సిందే. తొలుత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి తిరుమలకు చేరుకోగా, తిరుమల శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
 
అంతకుముందు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాహనశ్రేణిలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రపతి వాహనశ్రేణి తిరుమలకు వెళ్తుండగా అలిపిరి వద్ద కాన్వాయ్‌లోని ఓ వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వాహనాన్ని పోలీసులు క్రేన్‌తో తొలగించారు. కాగా, దక్షిణ భారతదేశ పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి విడిదికి వచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి