ఏపీ మంత్రులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:55 IST)
రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.సాకే శైలాజనాథ్ హితవు పలికారు. మంత్రులు తమ పదవులను కాపాడుకునేందుకు వారు మాట్లాడుతున్న భాషను చూసిన ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. గురువారం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో శైలజనాథ్ మాట్లాడుతూ, క్యాబినెట్ లో ఉన్న మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా స్వంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
 
బందరు పోర్టు పనులు ఎంతవరకు వచ్చాయన్న దాని గురించి పేర్ని నాని మాట్లాడాలన్న శైలజనాథ్, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అయిన బందరు పోర్టు నిర్మాణం రూ.3,650 కోట్లతో చేపడతామన్నారని, బందరు (మచిలీపట్నం) పోర్టు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. రైల్వే జోన్ గురించి మంత్రి అవంతి శ్రీనివాస్ సమాధానం చెప్పాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటుపరం కాకుండా అడ్డుకోవాలని సూచించారు.
 
పోలవరం, దుగరాజ పట్నం పోర్టు పనులపై మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్ ను ఆమోదించారని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్ ను జలశక్తి శాఖలోని ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 95వ మీటింగ్ లో ఆమోదించిందని తెలిపారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో మరొకసారి ఆమోదించిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే  పోలవరం ప్రాజెక్ట్ పనులు జరిగాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక పురోగతి ఏదని శైలజానాథ్ ప్రశ్నించారు. 
 
చెత్త పన్ను, ఆస్తి పన్ను పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు వివరణ ఇవ్వాలని సూచించారు. ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి పరిమితం చేశామని, ఇది చాలా తక్కువ అని ప్రభుత్వం చెబుతోందని , కరోనా కష్ట సమయంలో పన్ను పెంచడం తగదన్నారు. రాష్ట్రంలో టిడ్కో కాలనీల్లో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులను వేగవంతం చేసి మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇవ్వాల్సి వున్నా ఇంకా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. 
 
ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని ప్రశ్నిస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం సక్రమంగా జరిగేలా మంత్రులు శ్రద్ధ వహించాలని శైలజానాథ్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అధికార పార్టీ నాయకులు, మంత్రుల తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఇటీవల తనిఖీలలో బయటపడిన దాదాపు 20 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రజల ద్రుష్టి మరల్చేందుకు ఆడుతున్న డ్రామా లాగ అనిపిస్తోందన్నారు.
 
అధికారపార్టీ నాయకులు ప్రజల జీవితాలను అంధకారం చేసే డ్రగ్స్ రవాణా వెనుక వున్న సూత్రధారులు ఎవరో కనిపెట్టడం మానేసి ఇటువంటి అర్ధం లేని ప్రేలాపనలతో, ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తూ చిల్లర రాజకీయాలతో ప్రజాస్వామ్యం పరువు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. భారీ ఎత్తున రవాణా అవుతున్న డ్రగ్స్ పై పోలీసులు, ప్రభుత్వాలు తగు విచారణ చేపట్టి దీనివెనుక వున్న బాధ్యులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా, దోషులను కఠినంగా శిక్షించవలసినదిగా రాష్ట్ర కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు