ఈ దీక్షకు రాహుల్ గాంధీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. 2019లో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలాగే, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ శ్రీవారి సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలు మర్చిపోయారా? అంటూ నిలదీశారు. కేంద్రం తెలుగువారికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
విభజన హామీలన్నీ నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. హోదా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీతో చర్చల్లో పురోగతి లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు గురించి అడిగామన్నారు. జైట్లీ తెలుగు ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని విమర్శించారు.