కాస్త మిగులు కోసం మడమ తిప్పాలా?.. జగన్ పై రాయపాటి మోహన్ ఆగ్రహం

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (07:30 IST)
"పింఛన్లు మూడు వేలకు బదులు రూ.2,250/- కు పెంచినప్పుడు, 45 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు పెన్షన్ల బదులు ‘వై.ఎస్.ఆర్. చేయూత’ పథకం కింద దశలవారీగా రూ.75 వేలు ఇస్తానన్నప్పుడు కొంతమంది విమర్శించినా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే చేశారు" అని గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి క్రిష్ణ అన్నారు.
 
జగన్ ప్రభుత్వ పథకాలను తూర్పారబడుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. "జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలలో ఒకటిగా పేర్కొన్న రైతు భరోసా పథకానికి సంబంధించి నాలుగు దఫాలుగా మొత్తం రూ.50 వేలు రైతుకి ఇస్తానని చెప్పి సంవత్సరానికి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలని దీంట్లో కలపడం మోసం అవుతుంది. ప్రధానమంత్రి మోడీ ‘పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి యోజన’  క్రింద రైతులకు ఆరు వేల రూపాయలు 2019 ఫిబ్రవరిలోనే ప్రకటించారు.

ఏప్రిల్ లో మేనిఫెస్టో లో జగన్ రైతు భరోసా క్రింద రూ.50 వేలు  ఇస్తానని చెప్పారు. నాలుగు సార్లు బదులు ఇప్పుడు ఐదు సార్లు ఇస్తున్నారు కాబట్టి సంవత్సరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి మొత్తం రూ.16 వేలు సంవత్సరానికి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం కేవలం రూ.13,500 మాత్రమే ఇస్తున్నారు.
 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథకం కింద, కేంద్రం అందించే నిధులను కలుపుకుని సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తానని స్పష్టంగా ప్రకటించారు. అలాగే జగన్ కూడా  తన మేనిఫెస్టోలో కేంద్రం నిధులతో కలిపి ఇస్తానని పేర్కొన్నట్లైతే స్పష్టత ఉండేది.

పైగా కేంద్రప్రభుత్వం 6 వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. ఆ రూ.6 వేలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తుంటే జగన్ మోహన్ రెడ్డి వాదన అర్ధవంతంగా ఉండేది. దీంతో మాట తప్పను, మడం తిప్పను అనే జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పధకంలో మాట తప్పారు, మడం తిప్పారు.
 
జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే 2020 మే నుంచి 2023 మే వరకు నాలుగు సంవత్సరాలు కలుపుకుని ఏడాదికి రూ.12,500 ల చొప్పున ప్రతి రైతుకి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఐదు సంవత్సరాలు కలుపుకుని ప్రతి రైతుకి కేవలం రూ.37,500 మాత్రమే అందుతున్నాయి.

ప్రతి రైతుకి ఇంకా రూ.12,500 చెల్లించాలి. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలను కలిపి, మొత్తంగా రాష్ట్ర, కేంద్ర నిధులతో ఐదేళ్లకు రూ.80 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.67,500 మాత్రమే చెల్లించినట్లవుతుంది. అంటే 75 శాతం నిధులను రైతులకు అందిస్తున్నారు. కేవలం 25 శాతం నిధులను మాత్రం ఇచ్చిన మాటను పక్కన పెట్టి మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి అర్హత ఉన్న 51 లక్షల మంది రైతులకు పథకంలో కోత పెడుతున్న 25 శాతం నిధులను పరిశీలిస్తే ఏడాదికి రూ.1275 కోట్ల చొప్పున, ఐదు సంవత్సరాలకు గాను రూ.6375 కోట్లు మాత్రమే మిగులుతుంది.

ఎలాగూ కేంద్ర ప్రభుత్వ పథకం జాబితాలోకి రాని కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం చెల్లించాలి. కేవలం రూ.6375 కోట్ల మిగులు కోసం జగన్ మాట తప్పారు అనే అపవాదుని మూటగట్టుకోవడం గమనార్హం.
 
వై.ఎస్.ఆర్, ఆయన తదనంతరం జగన్ 'మాట తప్పరు-మడమ తిప్పరు' అనే నినాదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ఆ పదానికి సర్వ హక్కులూ వాళ్లవే అనేంతగా ప్రజలు విశ్వసించారు. గత పదేళ్లుగా అలాగే నోళ్లలో నానుతూ వస్తున్నారు.  అలాంటి ప్రజల విశ్వాసానికి తూట్లు పొడిచేలా జగన్ వ్యవహరించడం శోచనీయం.
 
2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపై పెట్టారు. వివిధ పరిమితులను పెట్టి లక్షన్నరకు తగ్గించి మొత్తం రుణమాఫి సుమారు 24 వేల కోట్ల రూపాయలకు కుదించారు. మూడు విడతలు చెల్లించారు.

నాలుగో విడత 2017 లో, ఐదో విడత 2018 లో మొత్తం కలిపి రూ.7,958 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2019, మార్చి నెలలో జీవో ఇచ్చారు. పోలింగ్ కు  మూడు రోజుల ముందు ఏప్రిల్ 8 న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలుగుదేశం పార్టీ పేరు, గుర్తు ఉన్న బ్యానర్ ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నాలుగవ విడత మొత్తం విడుదల చేశామని చెప్పారు.

కాని కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించారు. 2019, మే 23 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పోలింగ్ అయిన తర్వాత నాలుగవ విడత, ఐడో విడత చెల్లింపులు చేయకుండా ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. 2014 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని రైతు రుణమాఫీ హామీ ఇవ్వమని పార్టీ శ్రేణులు వత్తిడి తెచ్చినా దీని అమలు సాధ్యం కాదని ఆ హామీ ఇవ్వలేదు.

2019 ఎన్నికల ముందు ఎన్నో కొత్త పధకాలకు, హామీ ఇవ్వని వాటికి 13 వేల కోట్లు వెచ్చించిన చంద్రబాబునాయుడు తను మొదటి సంతకం చేసిన రైతు రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడానికి అవసరమైన రూ. 7,600 కోట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం ద్వారా రైతుల పట్ల తన చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధమవుతుంది.

2017, 2018 లో చెల్లించాల్సిన నాలుగు, ఐదు విడతల మొత్తాన్ని సకాలంలో చెల్లించకుండా జగన్ మోహన్ రెడ్డిని చెల్లించమనడం సరైంది కాదు.
 
అలా రైతు రుణ మాఫీ చెల్లించకుండా సరైన అడుగు వేసిన జగన్, రైతు భరోసా విషయంలో మాత్రం తప్పటడుగు వేశారని భావించాల్సి వస్తోంది.

ఏ విధంగా అయితే రైతు రుణ మాఫీ అమలులో చంద్రబాబు తన హామీకి తానే తూట్లు పొడుచుకున్నారో, అదే విధంగా జగన్ కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి కేంద్ర నిధులను కలిపేసి, మసి పూసి మారేడు కాయ చేసి, రైతులను మభ్యపెడుతున్నారని స్పష్టం అవుతోంది.

కేవలం సంవత్సరానికి రూ.1275 కోట్లు ఆదా చేసేందుకు మాట తప్పను మడమ తిప్పను అనే తన నినాదానికి తానే తిలోదకాలు ఇచ్చుకున్నట్లయ్యింది" అని ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు