ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటి ఆర్కే రోజా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఆమె తన వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఆమె సందర్శిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె శనివారం కర్నూలు జిల్లాలోని రాక్ గార్డెన్‌ను సందర్శించారు. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
ముఖ్యంగా, ఓర్వకల్లులో ఉన్న ఈ రాతి ఉద్యానవనంలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, కేవ్ మ్యూజియం, బోటింగ్, పిక్నిక్ స్పాట్లు, హరిత రిసార్టు ద్వారా వసతి అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్ పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఒక్క టూరిజం స్పాట్‌గానే కాకుండా సినిమా షూటింగులకు ఎంతో అనువుగా, అందంగా ఉంటుందని చెప్పారు.
గతంలో ఇక్కడ "జయం మనదేరా, టక్కరిదొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి" వంటి చిత్రాలను చిత్రీకరించినట్టు ఆమె గుర్తుచేశారు. కాగా, ఈ రాతి ఉద్యానవనం కర్నూలు జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి రోజా తెలిపారు.