సెక్షన్ 8 అమలు అవసరమే లేదు... అది సిఎంల మధ్య డ్రామా... జేపీ...

మంగళవారం, 30 జూన్ 2015 (06:48 IST)
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సెక్షన్ 8 అమలును కోరుతున్నారనీ, దీని వలన ప్రజల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉందనీ, ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదని లోక్ సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఓటుకు నోటు కేసు, ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులకు, సెక్షన్-8కు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకే సెక్షన్-8ను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. 
 
హైదరాబాదులో గడచిన ఏడాదిగా అభద్రతా భావం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిన సందర్భాలు ఏమైనా ఉంటే ప్రజలు చెప్పాలని ప్రశ్నించారు. అలాంటప్పుడు సెక్షన్ 8 అమలు ప్రస్తావన దేనికని విమర్శించారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని జేపీ ఆరోపించారు. 
 
ఈ సెక్షన్ ను మరోసారి తెరపైకి తేవడం వల్ల కల్లోల వాతావరణం ఏర్పడుతుందని, తాను ప్రధాని, గవర్నర్, కేంద్ర హోం శాఖ మంత్రులకు లేఖను రాశానని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి