టీడీపీలోకి శోభారాణి.. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు చెక్ పెట్టేందుకేనా?

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (11:44 IST)
ప్రజారాజ్యం పార్టీ ఫైర్ బ్రాండ్‌గా కొనసాగిన శోభారాణిని బుట్టలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆర్భాటంతో 2008లో ఆగస్ట్ 26న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ చాలామందికి గుర్తులేకపోయినా ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయిన శోభారాణి అంటే పొలిటికల్ సర్కిల్లో అందరికీ పరిచయమే.

పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో మహిళారాజ్యం అధ్యక్షురాలిగా చిరంజీవిపై ఈగ వాలినా సివాలెత్తిన శోభారాణి.. అప్పట్లో తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ వారిపైన విమర్శలు చేస్తూ తమదైన శైలిలో ఒక వెలుగు వెలిగింది. 
 
ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ఓటమిని చవిచూడడంతో మూన్నాళ్ళ ముచ్చటగానే మూడు సంవత్సరాలలో పీఆర్పీ ఆవిరైపోయింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అయితే అప్పట్లో చిరంజీవిని నమ్ముకొని ప్రజారాజ్యం పార్టీలో చేరిన నాయకులూ మా పరిస్థితి ఏంటంటూ బహిరంగంగానే విమర్శించారు. వారిలో ముందు వరసలో నిలబడి చిరంజీవిపై బహిరంగంగానే విమర్శలు చేశారు శోభారాణి. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన శోభారాణిని ప్రస్తుతం టీడీపీలోకి తీసుకునేందుకు ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 
 
గుంటూరు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాను కట్టడి చెయ్యాలంటూ కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న శోభారాణి అయితేనే కరెక్ట్ అని గుర్తించిన టీడీపీ నేతలు శోభారాణికి పచ్చ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు గుంటూరు నేతలు. దీంతో శోభారాణి సుదీర్ఘ కాలానికి తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి