రంజాన్: హైదరాబాద్‌ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, కొత్త కళ!

మంగళవారం, 29 జులై 2014 (18:49 IST)
రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ‌లోని మక్కా మసీదు, మీరాలం ఈద్గా, నాంపల్లిలోని ఏక్ మినార్‌, ఖైతరాబాద్ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. 
 
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పురస్కరించుకుని నగరంలోని మసీదులు కొత్త కళను సంతరించుకున్నాయి.
 
రంజాన్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వెబ్దునియా పై చదవండి