ఏపీలోని విజయవాడ నగరంలో మరో దారుణం జరిగింది. బైకుపై వెళుతున్న యువకుడు ఒకడు రోడ్డుపై ఉమ్మి వేశాడు. అది కాలికి వెనుకనే వసున్న కారుపై పడింది. అంతే.. కారులోని దిగిన ఓ వ్యక్తి.. ఆ యువకుడిని పట్టుకుని బెల్టుతో చితకబాదాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఇతరులను కూడా ఆ కోపిష్టి బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయవాడ పటమటకు చెందిన గోవిందరాజు మంగళవారం రాత్రి 11.45 గంటల సమయంలో తన బైకుపై రామవరప్పాడు వైపు వెళుతున్నాడు. అదే సమయంలో లబ్బీపేటకు చెందిన కొండపల్లి నిఖిల్ అనే వ్యక్తి కారులో అదే మార్గంలో వెళుతున్నాడు. ఈ క్రమంలో గోవింద రాజు ఆస్పత్రి కూడలి వద్ద రోడ్డుపై ఉమ్మి వేశాడు. అది గాలికి వచ్చి కారుపై పడింది. దీంతో కారు ఆపి కోపంతో దిగిన నిఖిల్.. బెల్టుతో గోవిందరాజులను చితకబాదాడు.
అక్కడితో ఆగకుండా ఫోనుతో పాటు బైకు తాళం చెవిని కూడా లాక్కున్నాడు. అటుగా వెళుతున్న వాహనదారులు నిఖిల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసి వారిపైనా తిరగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చిన నిఖిల్‌ను స్టేషన్‌కు తరలించి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారును కూడా సీజ్ చేసి స్టేషన్ ప్రాంగణానికి తరలించారు.