బుధవారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 186 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు.
మహా పూర్ణాహూతితో ముగిసిన అకాల మృత్యుహరణ మహాయజ్ఞం
విశ్వంలోని సకలప్రాణి కోటికి మృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తిరుపతి కపిలతీర్థం ప్రాంగణంలో జరుగుతున్న అకాల మృత్యుహరణ మహాయజ్ఞం బుధవారం ఉదయం మహా పూర్ణాహూతితో ముగిసింది. డిసెంబరు 30వ తేదీ నుండి ఈ మహాయజ్ఞం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వేద పండితులు ప్రతి రోజు శ్రీ మహామృత్యుంజయ మంత్రాన్ని లక్షసార్లు పఠించడం జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 51 మంది కృష్ణయజుర్వేద పండితులు, ఎస్వీ వేద వర్సిటీ ఆచార్యులు యజ్ఞం, జపం, తర్పణం క్రతువులు నిర్వహించారు. కృష్ణ యజుర్వేదంలోని భట్టభాస్కరుడు రచించిన శ్రీరుద్రంలోను, శాంతికల్పం అనే గ్రంథంలోను ఇది ఉంది. ఈ యాగం వల్ల మృత్యుదోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్సెక్టర్ రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.