ఏపీలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం: సుజనా చౌదరి

గురువారం, 26 నవంబరు 2015 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం అనంతరం సుజనా చౌదరి  మీడియాతో మాట్లాడుతూ... రెండు నెలలకొకసారి ఎన్డీయే పక్షాల సమావేశం నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరినట్లు చెప్పారు. 
 
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రధాని చెప్పినట్లు సుజనా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి మరోసారి సమస్యలు వివరించాలని తనకు సూచించారన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలవనున్నట్లు సుజనా చెప్పారు. అకాల వర్షాలు, వరదలపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 
 

వెబ్దునియా పై చదవండి