ప్రజల మనసుల్లో ద్వేషాన్ని రూపుమాపేందుకు ఎంత పోరాటం చేయాలి: సునయన ప్రశ్న
గురువారం, 2 మార్చి 2017 (03:45 IST)
చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న... మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేము కలలు గన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలిసి నివసించడానికి ఇది సురక్షితమేనా
ఓ కాళరాత్రి అమెరికాలో జాతి వివక్షా ఉన్మాద చేష్ట్య కారణంగా తన జీవన సహచరుడిని పోగొట్టుకున్న సునయన యావత్ ప్రపంచానికి వినిపిస్తున్న ఆత్మఘోష ఇది. తన భర్తను బలిగొన్న ఘటనల వంటివి జరిగినప్పుడు కొంత కాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుందనీ, కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారనీ.. కానీ ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి ఎంత పోరాటం జరగాలి అని ప్రశ్నిస్తున్నారామె. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వాలు ఏం చేయబోతాయి అని నిలదీస్తున్నారామె.
ఒకే ఒక వ్యక్తి మూలంగా. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది అతను ఆలోచించని మూలంగా ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి... భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియటం లేదని విలపిస్తున్న సునయన వ్యక్తిగత జీవితంలో తన ప్రమేయం లేకున్నప్పటికీ ఓడిపోయిన నిస్సహాయ క్షణాల్లో కూడా ప్రపంచాన్ని శపించలేదు. తన కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని కోరుకుంటోందామె.
బండగుండెల ట్రంప్ జాతి వివక్షకు ఇస్తున్న కొత్త నిర్వచనం సాక్షిగా అమరికాలో పెరిగిపోతున్న ఉన్మాదాన్ని సవాలు చేస్తూనే తన భర్త ప్రాణాలు కాపాడటానికి ప్రాణం అడ్డువేసిన సాటి అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిలాట్ ప్రేమను పంచడంపై తనలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతున్నాడని కృతజ్ఞతలు చెబుతున్నారు సునయన. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్.. సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి.
ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు చెబుతూనే ప్రపంచ సాంకేతిక దిగ్గజ సంస్థల సీఈఓలను ద్వేషాన్ని ఆపి ప్రేమను వ్యాపింపజేసే మృదు సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవలసిందిగా ఆమె అభ్యర్థిస్తున్నారు. "మార్క్ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను."
జీవనలత ఒక్కసారిగా కళ్లముందే వాడిపోయిన భయవిహ్వల క్షణంలోనూ గుండె దిటవు చేసుకుని తన జీవన సహచరుడు శ్రీనివాస్ ఆకాంక్ష మేరకు అమెరికాలోనే కెరీర్ నిర్మించుకోవడానికి తప్పకుండా ఆ దేశానిని మళ్లీ వెళతానని సునయన చేబుతున్నారు. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను అంటూ శపథం చేస్తున్నారు.
అమెరికాలోనే కాదు... భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరిగిపోతున్న విద్వేష భావనలను, వాటిని ఎగవేస్తున్న సంకుచిత రాజకీయాలను సునయన ఆత్మ ఘోష మారుస్తుందా.. మానవత్వానికి ఆమె ఇస్తున్న నిలువెత్తు నిర్వచనాన్ని ఈ ప్రపంచం ఏనాటికైనా తనదిగా చేసుకుంటుందా?