రాజ్ భవన్ దర్బార్ హాలులో ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు

బుధవారం, 12 జనవరి 2022 (13:21 IST)
స్వామి వివేకానంద మహిళలు, అట్టడుగు వర్గాలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉద్ధరణలో కీలక భూమిక పోషించారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వివేకానంద బాల్య వివాహాలు, నిరక్షరాస్యత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసారన్నారు. భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ ఘనంగా నివాళి అర్పించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 
 
 
'జాతీయ యువజన దినోత్సవం'గా కూడా ఈ రోజును పాటిస్తున్నామని,  స్వామి వివేకానంద తన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ప్రేరణగా నిలిచారన్నారు. 1893 సెప్టెంబరు లో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో భారతీయ దూతగా ఆయన చేసిన ప్రసంగాలు పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించాయన్నారు. భారతదేశ ఆధ్యాత్మికత ఆధారిత సంస్కృతి, బలమైన చరిత్రపై వివేకానందుని ప్రసంగాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయన్నారు. ముఖ్యంగా మేధావి వర్గం నుండి ప్రశంసలు పొందగలిగారన్నారు. స్వామి వివేకానందుని బలమైన వ్యక్తిత్వం, శాస్త్రం, వేదాంత రంగాలలో అపారమైన జ్ఞానం, మానవ, జీవజాతుల పట్ల సానుభూతి ఆయనను శాంతి, మానవత్వంలకు మార్గదర్శిగా చూపాయన్నారు.
 
 
 గవర్నర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, హింసను ఖండిస్తూ వచ్చారన్నారు. మతం పట్ల వివేకానందుని విధానం శాస్త్రీయ అధ్యయన సహితమన్నారు. స్వామి వివేకానంద భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉపన్యాసాల పరంపరను కొనసాగించారని, ప్రజలలో మతపరమైన స్పృహను రేకెత్తించడానికి, సాంస్కృతిక వారసత్వంపై వారిలో గర్వాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించారన్నారు.  అణగారిన వర్గాల దుస్థితిపై దృష్టిని కేంద్రీకరించడం, ఆచరణాత్మక వేదాంత సూత్రాలను అన్వయించడం ద్వారా వారి అభ్యున్నతి కోసం ప్రయత్నించారని బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. 
 
 
ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నందున, రాజీ పడకుండా జాగ్రత్తలను పాటించాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేసారు. సురక్షితమైన కోవిడ్ వ్యాక్సిన్ వైరస్ నుండి రక్షణను అందిస్తుందని, 15-18 సంవత్సరాల వయస్సు గల యువతతో సహా అర్హులైన వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలని గౌరవ గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు