కర్నూలు జిల్లాలో టీడీపీ దూకుడు

బుధవారం, 27 జనవరి 2021 (12:09 IST)
కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. తొలి విడత ఎన్నికల ప్రక్రియకు వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా.. వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది.

నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో అధికారపార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. కోడుమూరులో మూడు వర్గాలు, నందికొట్కూరులో రెండు వర్గాలుగా ఆ పార్టీ నాయకులు చీలిపోయారు. 
 
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో టీడీపీ కాస్త దూకుడుగా ఉంది. బనగానపల్లె, కోడుమూరు, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో బీసీ జనార్దన్‌ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత తదితరులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.

కోడుమూరులో 13 పంచాయతీలు, బనగానపల్లె మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, సి.బెళగల్‌లోని 18, గూడూరులోని 9, ఆళ్లగడ్డలోని 99 గ్రామ పంచాయతీలకు, గోస్పాడు మండలంలోని 15, నంద్యాలలో 17, బండి ఆత్మకూరు 20, మహానందిలో 13, వెలుగోడులోని 8, ఆత్మకూరులో 16, కల్లూరులోని 18 పంచాయతీలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేస్తున్నారు.

గతం కంటే ఈసారి టీడీపీ తరపున అభ్యర్థులు అధికంగా ముందుకు వస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఇక అధికార పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఇది ఇబ్బందిపెట్టే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీలో వర్గ పోరుతో సతమతమవుతున్న మండలాలపైనా టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండగా కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. అధికారులను నియమించకపోవడం, ఓటరు జాబితా తదితర అంశాలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు