తెలుగుదేశం పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వచ్చే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అరాచక వైకాపా ప్రభుత్వంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారని, అందువల్ల వారందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 1994లో ప్రతిపక్షంలో ఉండగా ఆ రోజున మనతో ఉన్న మొత్తం 74 మందికి టిక్కెట్లు ఇచ్చామని, వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారని, కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆయనకు పార్టీ రాజ్యసభ స్థానం ఇచ్చి ప్రమోషన్ కల్పించిందని గుర్తుచేశారు.
"వైకాపావి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. టిక్కెట్లు ఇవ్వబోమని ఎమ్మెల్యేలను జగన్ బెదిరిస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వనపుడు చాకిరీ ఎందుకని అనేక మంది ఎమ్మెల్యేలు పైపైన తిరుగుతున్నారు. కానీ మన ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. వారిని అభనందిస్తూనే, వారందరికీ 2024లో ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తాం" అని ప్రకటించారు.