ప్రధాని మాటలు నమ్మకూడని పరిస్థితి వస్తుందని అనుకోలేదు... బీజేపీకి చావుదెబ్బ తప్పదు

శుక్రవారం, 9 నవంబరు 2018 (19:10 IST)
అమరావతి: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను సంఘటితం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని వివిధ పార్టీలను కూడగట్టడంలో చంద్రబాబు తీసుకుంటున్న చొరవరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నియంతృత్వంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 కోట్ల ఆంధ్రప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నరని విమర్శించారు. 
 
ప్రధానమంత్రి మాటలు తాము నమ్మామని, ప్రధాని మాటలు నమ్మకూడని పరిస్థితి వస్తుందని తాము అనుకోలేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదలన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన వివిధ పార్టీలను కూడగట్టడం ఆంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబించే విధంగా ఉందన్నారు. నిన్న బెంగుళూరు వెళ్లిన సందర్భంగా పద్మనాభ నగర్‌లో చంద్రబాబు నాయుడుని చూడటానికి ప్రజలు భారీ స్థాయిలో తరలి వచ్చారని చెప్పారు. 
 
మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిలను చంద్రబాబు కలవడం దేశంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడానికి ఓ వేదిక ఏర్పాటు చేయడంలో భాగంగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వానికి కర్ణాటక ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. కర్ణాటక ఫలితాలే అందుకు విజయ సూచికగా పేర్కొన్నారు. కర్ణాకటలో ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని చావు దెబ్బతీశాయన్నారు.  ఇది శుభ సూచికంగా పేర్కొన్నారు. దేశంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను ఇవి సూచిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు