తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె. అచ్చె న్నాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ జనార్థన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జి.వెంకట రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, గృహిణులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధరల నియంత్రణలో జగన్ రెడ్డి విఫలమయ్యారని సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులమయం చేశారని, 6.8 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు పెంచుకుంటూ పోయారని, ఈ నిధులన్నీ ఏయే పథకాలకు, ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించారని, దీంతో జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడం అనేది డిజిన్వెస్ట్ మెంట్ విధానంలో భాగం కాదని, బిల్డ్ ఏపీ కేసులో ఇంప్లీడ్ కాలేమని కేంద్రం తేల్చి చెప్పడం జగన్ రెడ్డికి చెంపపెట్టని సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.
దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉంది. మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలని, మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే 75శాతం మేర ధరలు పెంచామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పారన్నారు.
రాయలసీమకు జగన్ రెడ్డి ద్రోహంపై క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని సమావేశంలో నేతలు తీర్మానించారు. మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడటాన్ని సమావేశం ఖండించింది.
జగన్మోహన్ రెడ్డి తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారని, మరోవైపు ఆర్టీసీ భవిష్య నిధి రూ.1600 కోట్లను కూడా దారిమళ్లించడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డి సొంత బాబాయి అయిన వివేకానందరెడ్డి హత్య కేసును కుట్రపూరితంగా దారి మళ్లిస్తున్నారని, బాధితులనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.