పేరుకు విశ్వనగరమని గప్పాలు: రాజధాని నడిబొడ్డున ఉద్యోగిని దారుణహత్య
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (02:45 IST)
విశ్వనగరంగా గప్పాలు కొట్టుకుంటున్న తెలంగాణ రాజధానిలో మరో ఘోరం జరిగింది. టెలికాలర్‌గా పనిచేస్తున్న సునీత (32) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పట్టపగలే ఆమెను హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ సీ క్లాస్ ప్రాంతానికి చెందిన కొరపు మాణిక్‌రావు, జానకమ్మ దంపతుల కుమార్తె సునీత. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. గతంలో సులేఖ.కామ్‌లో పనిచేసిన ఆమె.. కొద్దిరోజుల కిందట మాన్‌స్టర్.కామ్‌లో టెలికాలర్ (సేల్స్ రిప్రజెంటేటివ్)గా చేరింది. మంగళవారం ఆఫీసుకు వెళుతున్నానంటూ ఇంటి నుంచి వెళ్లింది. కానీ ఆఫీసుకు వెళ్లలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి.. దగ్గరి బంధువు ఒకరు చనిపోయారని, రెండు రోజులు రాలేనని సమాచారం ఇచ్చింది. మంగళవారం రాత్రి పదింటికి తిరిగి ఇంటికి చేరుకుంది. బుధవారం ఉదయం 9.30కు ఆఫీసుకు బయలుదేరిన ఆమెను అన్న నర్సింగ్‌రావు సికింద్రాబాద్ స్టేషన్ బస్టాప్‌లో దింపి వెళ్లిపోయాడు. కానీ ఆమె ఆఫీసుకు వెళ్లలేదు. సునీత హత్యకు గురైనట్లు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులకుపోలీసుల నుంచి సమాచారం అందింది.
భాగ్యనగర్ సొసైటీ 1007 ఎన్‌ఐఏ బిల్డింగ్ పక్కన ఖాళీ స్థలం నుంచి పొగలు వస్తున్నాయంటూ అక్కడి ఓ సెక్యూరిటీ గార్డు బుధవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. అక్కడే పాక్షికంగా కాలిపోయిన పర్సు, ఐడీ కార్డు లభించాయి. ఆ పర్సులో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా హతురాలిని సునీతగా గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబీకులకు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు. ఇది ఎవరో పరిచయస్తుల పనేనని, మరొకరు కూడా సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
సునీతను పథకం ప్రకారం ఖాళీ స్థలానికి తీసుకొచ్చి హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. సునీత సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్, భాగ్యనగర్ సొసైటీ, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రోజు వాలెంటైన్స్ డే కావడంతో ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రస్తావన ఈ హత్యకు కారణాలై ఉంటాయా అన్న కోణాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత యువకుడి ఫొటోలను సునీత మెయిల్ నుంచి పోలీసులు తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
మంగళవారం రాత్రి సునీత ముభావంగా కనిపించిందని, అన్నం కూడా సరిగా తినలేదని ఆమె అక్క శ్రీదేవి చెప్పారు. బుధవారం ఉదయం సునీత ఆఫీసుకు వెళుతుండగా.. లంచ్ బాక్స్ సిద్ధం చేయబోతే ఆఫీసులో పార్టీ ఉందంటూ వారించిందని తెలిపారు. ఇక ఓ ఫోన్ కాల్ వస్తే సునీత విపరీతంగా ఏడ్చేదని, అది ఎవరనేది తమకు చెప్పేది కాదని ఆమె అన్న నర్సింగరావు చెప్పారు. 2001లో ఓ యువకుడు తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని, తాము కేసు పెట్టడంతో జైలు పాలయ్యాడని వెల్లడించారు.
16 ఏళ్ల క్రితం ప్రేమ విఫలమై మనసు విరిగిపోయిన సునీత ఇకపై తను పెళ్లిచేసుకోనని ప్రకటించి అన్న కుమార్తెలను సొంత కూతుళ్లుగా పెంచుకుంటున్న సునీత అనూహ్యంగా హత్యకు గురవటం ఆ కుటుంబానికి షాక్ కలిగించింది. సునీత దారుణ హత్యకు గురికావడంతో ఆ చిన్నారులు విలపించిన తీరు అందరినీ కలచివేసింది.