విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండపల్లి వద్ద కిలేశపురంలోని వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చిన యువకులు... తమలోతాము గొడవపడి కొట్టుకున్నారు. దొమ్మిలా ఒకరిపై ఒకరు పడి తన్నుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి అక్కడే ఉన్న కర్రలు, బాదులతో కొట్టుకున్నారు.
ఇబ్రహీంపట్నం ఈ కొట్టాట కేసులో పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్ వార్ చేసిన సభ్యుల కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్పడి గాలింపులు చేస్తున్నారు. విజయవాడలోని చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాలు వద్ద గాలిస్తున్నారు.
అయితే, ఇబ్రహీంపట్నంలో జరిగింది గ్యాంగ్ వార్ కాదని, సంఘటనలో పాత నేరస్తులు ఎవరూ లేరని, అలాగే, అక్కడి స్థానికులు కూడా ఎవరూ లేరని ఏసీపీ హనుమంతరావు చెప్పారు. కొట్టాటకు దిగిన యువకులంతా విజయవాడలోని నున్న, ప్రకాష్ నగర్, సింగ్ నగర్‌కు చెందిన వారేనని తెలిపారు.
ఈ కొట్లాటలో ఎవరూ చనిపోలేదని, గాయపడిన యువకుడికి చికిత్స జరుగుతోందని చెప్పారు. మరికొంత మంది యువకుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎక్కడ కొట్లాటలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని ఏసిపి హనుమంతరావు చెప్పారు.