ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు: జగన్

గురువారం, 4 మార్చి 2021 (08:46 IST)
సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సమగ్రమైన బ్యాంకు సేవలు కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలని సీఎం జగన్‌ సూచించారు.

పీఏసీఎస్‌లు క్రెడిట్‌ సేవలతో పాటు నాన్‌ క్రెడిట్‌ సేవలు కూడా అందించాలని,  పీఏసీఎస్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్‌ ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలని అన్నారు.

వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలని సిఫార్సు చేశారు. బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలని, బోర్డులో సగం మంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు విరమించేలా ఏపీసీఎస్‌ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలని పేర్కొన్నారు.

అలాగే పీఏసీఎస్‌ల్లో కూడా మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలని, గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావాలని తెలిపారు. ఈ మేరకు చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు.

పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్‌కు నిర్ణయం తీసుకోగా రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏంచేయాలన్న దానిపైన కూడా కార్యాచరణ ఉండాలని సీఎం అన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు