కరోనా కష్ట కాలంలో అన్నార్తులను ఆదుకుంటూ ప్రతి రోజూ భోజనం పంపిణీ చేయటం స్పూర్తిదాయకమని జిల్లా సంయిక్త పాలనాధికారి మాధవిలత అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేదల కోసం కాజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు చేపట్టటం ముదావహమన్నారు.
గత నెల రోజులుగా పౌండేషన్ నేతృత్వంలో నిత్యం ఆహార పంపిణీ జరుగుతుండగా, శుక్రవారం నగరంలోని జెసి క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన ముగింపు కార్యక్రమానికి మాధవిలత ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ రానున్న రోజుల్లో ధర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నామని, ఈ క్రమంలో స్వచ్ఛంధ సంస్ధలు మరింతగా ముందుకు వచ్చి నిస్సాహాయులకు సేవలు అందించాలని సూచించారు.
కాజా హెల్సింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఛైర్మన్ కాజా చక్రధర్ మాట్లాడుతూ నిర్భాగ్యుల కోసం ఫౌండేషన్ గత నెల రోజులుగా చేపట్టిన సేవా కార్యక్రమాలు సంతృప్తి నిచ్చాయన్నారు. ప్రత్యేకించి ఆసుపత్రులకు కరోనా రోగులకు సహాయకులుగా వచ్చి హోటళ్ళు, బంధువులు లేక దిక్కుతోచని స్దితిలో ఉన్న వారికి తమ ఆహార వితరణ కొనసాగిందన్నారు. తమ ఆశయానికి బాసటగా స్నేహితులు, బంధుమిత్రులు నిలిచారని పౌండేషన్ సహా వ్యవస్ధాపకురాలు కాజా వెంకట రమణి అన్నారు.
కరోనా పరిస్థితులు కొంత మేర సద్దుమణిగిన నేపధ్యంలో ప్రస్తుతం భోజన పంపిణీకి తాత్కాలిక విరామం ఇస్తున్నామని, అత్యవసర పరిస్దితులలో ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు తమ పౌండేషన్ సిద్దంగా ఉంటుందని రమణి వివరించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, సూరపనేని శేషు, తిరుమల రావు, సుబ్రమణ్యేశ్వరరావు, నరసయ్య, మౌర్య తదితరులు పాల్గొన్నారు.