టైమ్‌కి రాకపోతే అంతే.. కుర్చీలు ఖాళీగా ఉంటే..?

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:11 IST)
అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆకస్మికంగా సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. వచ్చీరాగానే తన పంచాయతీరాజ్ విభాగానికి వెళ్లి చూశారు. దాదాపు అన్ని సెక్షన్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. 
 
21 మంది అధికారుల్లో కేవలం నలుగురే విధులకు హాజరయ్యారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగపు కమిషనర్ కూడా ఆలస్యంగానే వచ్చారని తప్పుపట్టారు. అంతలో మంత్రి వచ్చిన సమాచారం తెలియడంతో ఉద్యోగులు హడావుడిగా కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు.
 
తొలి తనిఖీ కావడంతో ఉదారంగా వ్యవహరిస్తున్నామని.. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవటం సరికాదని కేటీఆర్ చెప్పారు.
 
‘పరిపాలనకు సచివాలయం గుండెకాయ లాంటిది. ఇక్కడే సమయపాలన పాటించకపోతే   క్షేత్రస్థాయి వరకు అటువంటి సంకేతాలే వెళ్తాయి. కొత్త రాష్ట్రంపై ప్రజలకు కోటి ఆశలున్నాయి’ అని అన్నారు. సెక్షన్ క్లర్కు నుంచి కమిషనర్.. ముఖ్య కార్యదర్శి వరకు ఎవరైనా సరే సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని.. టైమ్‌కు రాని ఉద్యోగులపై చర్యలుంటాయని.. గైర్హాజరు అయినట్లు పరిగణిస్తామని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి