నయీం కేసులో ఎందుకంత ఉదారత? ... కేసీఆర్ పై రాములమ్మ సంచలన కామెంట్స్

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:50 IST)
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నయీం కేసులతో  సంబంధం ఉన్న వారి లిస్ట్ గురువారం బట్టబయలు కావడంతో దానిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. 
 
నయీం కేసును కేంద్ర హోంశాఖ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విజయశాంతి అభిప్రాయపడ్డారు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడుతుందని చెప్పుకొచ్చారు. నయీమ్ కేసులో కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గ్యాంగ్ స్టర్ నయీమ్ డైరీలో ప్రస్తావించిన పేర్లనే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి కుదిపేస్తోంది. ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి నాటకాలు ఆడటం ఇది కొత్త కాదు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
నయీమ్ డైరీలో పేర్కొన్న పేర్లకు సంబంధించి వివరాలు పత్రికల్లో వచ్చాయి. కానీ ఈ వివరాలలో కూడా చాలా వరకు ఎడిటింగ్ జరిగినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా నయీమ్‌తో సంబంధాలు ఉన్న అధికారులు ఇతర పార్టీ నేతల వివరాలు వెల్లడించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీకి సంబంధించిన కీలక నేతల వివరాలను ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేసింది.  
 
ఉద్దేశపూర్వకంగా కొందరి పేర్లను మాత్రమే లీక్ చేశారని చాలా మంది పేర్లను మిస్ చేసినట్లు తెలుస్తోందన్నారు. నయీమ్‌తో మొదటి నుంచి లింకులు ఉన్న కొందరు నేతలకు టీఆర్ఎస్ పెద్దలు అభయ హస్తం ఇచ్చారని ఫలితంగా నయీమ్ ద్వారా దోచుకున్న సొమ్ములో వాటా కూడా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. 
 
నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన కొందరు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ హైకమాండ్ అండతో కీలక పదవులను అనుభవిస్తూనే ఉన్నారని విమర్శించారు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
కేసీఆర్ ప్రభుత్వంలో జరిగే అరాచకాలపై కేంద్రం దృష్టి సారించిందని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు నయీమ్ వ్యవహారంపై అసలు నిజాలు వెలుగులోకి వచ్చేందుకు కేంద్ర హోంశాఖ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే టీఆర్ఎస్ బండారం బయట పడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నయీమ్ పేరుతో జరిగే నాటకానికి తెర పడుతుందంటూ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు