విజయవాడ లోక్‌సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. విజయవాడ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. తన కుమార్తె శ్వేత కూడా పోటీ చేయబోదని, ఆమె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీ నుంచి బయటకు వెళ్లబోనని, టీడీపీతోనే కొనసాగుతానని నాని స్పష్టంచేశారు.
మరోవైపు నాని నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా తదితరులతో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, నాని నిర్ణయం వెనుక బలమైన కారణమే వుంది. ఇటీవల ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమలో మాట్లాడుతూ, పార్టీ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, పార్టీ లేదూ బొంగూ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే కేశినేని నాని ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.